Breaking News
Loading...
Sunday, June 20, 2010

మాయల బజార్..



తెలుగు సినీవినీలాకాశానికి మకుటంలాంటిది మాయాబజార్. అంతగొప్పగా మరో సినిమా తెలుగులో రాలేదు.. గ్రాఫిక్స్.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోయినా.. అత్యద్భుతంగా తెరకెక్కి.. అందరినీ సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది మాయాబజార్. ఒక్కమాటలో చెప్పాలంటే అందరినీ మాయ చేసేసింది. అయితే.. ఈ మాయల వెనుక రహస్యాలేమిటిన్నది ఇప్పుడు బయటపడింది..

లాహిరి..లాహిరి..లాహిరిలో అంటూ.. చల్లని వెన్నెలలో సాగే పాట మాయాబజార్ సినిమాకే కాదు.. తెలుగు సినిమాలన్నింటికీ హైలెట్. ఒకే పాటలో మూడు జంటలు కనిపించడమూ విశేషమే. ఈ పాటలో వెన్నెల కనిపించేంత అందంగా మరో సినిమాలో కనిపించలేదన్నది ఎంతోమంది మాట. అయితే.. ఇంత చల్లగా కనిపించే వెన్నెలను మిట్టమధ్యాహ్నం మండుటెండలో సృష్టించారు. అంతేకాదు.. టీవీలు తెలుగువారికి పరిచయం కాకముందే.. ఆ ఎఫెక్ట్‌నూ ఈ సినిమాలో చూపించారు. అదే ప్రియదర్శిని. శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రియదర్శినిని తెరవగానే నీవేనా నను పిలిచినదీ అంటూ శశిరేఖను అభిమన్యుడు పలకరించడమూ... ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక మాయాబజార్‌లో కనిపించే మాయల సంగతైతే చెప్పనక్కరలేదు. కంప్యూటర్లు, గ్రాఫిక్స్ లేని యాభై ఏళ్ల కిందటే ఎన్నో అద్భుతాలను వెండితెరపై పండించిందీ సినిమా. అప్పటికీ ఇప్పటికీ అబ్బురమనిపించే సన్నివేశం.. ఘటోత్కచుడి వివాహభోజనం. రకరకాల వంటకాలతో ఉన్న ప్లేట్ల ముందు ఘటోత్కచుడి భారీ ఆకారాన్ని దాల్చడం.. నోరు తెరవగానే.. ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ వెళ్లడం.. రత్న గింబళి.. కర్రలు గాల్లో ఎగిరి వెళ్లి పండితులను కొట్టడం.. ఇలా ఎన్నో మాయలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అప్పట్లోనే ఈ సన్నివేశాన్ని ఎలా తీశారో ఎవరికీ అర్థం కాలేదు. డబుల్ ఎక్స్‌పోజర్ - మాస్క్ విధానంలో దీన్ని తీసినట్లు ఆ తర్వాతి కాలంలో కెమెరామెన్ బార్‌ట్లే చెప్పారు. సగ భాగానికి ఫార్వర్డ్ యాక్షన్, మిగతా సగానికి రివర్స్ యాక్షన్ ఇస్తే ఈ ఎఫెక్ట్ వస్తుందన్నారు. అయితే.. అలాంటి ఎఫెక్ట్‌ను మళ్లీ ఎవరూ తీయలేకపోయారు.. అదే బార్‌ట్లే ప్రతిభకు నిదర్శనం.
ఇక అభిమన్యుడు అడవిలోకి వెళ్లినప్పుడు కమ్ముకొచ్చే దావానలం పిక్చరైజేషన్ కూడా అద్భుతమే. అడవితో పాటు అభిమన్యుడి రథాన్ని.. దాన్ని చుట్టుముడుతున్న మంటలను ఒకేఫ్రేమ్‌లో చూపించడమూ అప్పట్లో సంచలనమే. అయితే.. ఇలాంటి అద్భుతాలను... మాయాబజార్ మాయలను.. సినిమాలోని రహస్యాలను విశ్లేషిస్తూ.. ఇప్పుడు ఓ పుస్తకం తెలుగవారందరికీ అందుబాటులోకి వచ్చింది. అలనాటి ఆణిముత్యం మాయాబజార్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు రచయిత రాంభట్ల నృసింహశర్మ.

స్టోరీ ఎక్కడిది?

సినిమా టైటిల్ మాయాబజార్ అయినా... కథంతా శశిరేఖా పరిణయమే. శశిరేఖగా మహానటి సావిత్రి అద్భుత నటన.. కృష్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా అక్కినేని నటనాకౌశలం.. ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు రాజసం మాయాబజార్‌కు ప్రాణం పోశాయనే చెప్పాలి. మాయాబజార్ చూస్తున్నంత సేపు.. క్యారెక్టర్లే కనిపిస్తాయి తప్ప.. అందులో నటీనటులు కాదు. అందుకే.. తెలుగు సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది మాయాబజార్.
శశిరేఖ పాత్ర అటు భారతంలో గానీ.. మరే ఇతిహాసాల్లోగానీ మనకు కనిపించదు. అసలు బలరాముడికి కూతురు ఉన్న విషయమూ ఎక్కడా ప్రస్తావనకు రాదు. పైగా.. శశిరేఖా పరిణయం మన దగ్గర ప్రాచుర్యం ఉన్న కథ కూడా కాదు. భారతం అందరికీ తెలిసినా... అభిమన్యుడి గురించి.. ఘటోత్కచుడి గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి.. ఆ ఫాంటసీ క్యారెక్టర్లను ఆధారంగా చేసుకుని కథలు అల్లుకున్నారు మహారాష్ట్రలోని జానపదులు. అభిమన్యుడి ప్రేయసిగా.. వత్సల అనే పాత్రనూ ఈ జానపదులు సృష్టించారు. ఆ వత్సలే.. మన దగ్గర శశిరేఖ అయ్యిందన్న విషయం పరిశోధనలో తేలింది.
మరి మహారాష్ట్రలో పుట్టిన వత్సల మన దగ్గరకు ఎలా వచ్చింది.. మన దగ్గర శశిరేఖగా ఎలా మారింది..? దీనిపైనా పరిశోధన సాగింది. సన్నివేశాలను శశిరేఖా పరిణయం, తాళాంకనందనీ పరిణయం నుంచి తీసుకున్నప్పటికీ... మాయాబజార్ రచయత పింగళి నాగేంద్రరావు మూలకథను మాత్రం మహారాష్ట్ర జానపదం చిత్రకథ నుంచే తీసుకున్నారు. దానికి కారణం.. ఆయన మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవారే కావడమే.
అయితే.. మహారాష్ట్రకు చెందిన ఈ కథను మనకథే అన్నట్లుగా ఎలా మాయచేయగలిగారు. అచ్చ తెలుగు సంభాషణలు.. అద్బుతమైన పదప్రయోగాలు సినిమాలో ఎలా కనిపించాయి. దీనికి కారణం.. రచయిత పింగళి నాగేంద్రరావే. శశిరేఖాపరిణయం ఆధారంగా రాసిన రెండు గ్రంథాలు తెలుగులో అప్పటికే ఉన్నాయి. ఒకటి అప్పప్ప కవి విరచితమైన శశిరేఖాపరిణయం కాగా.. మరొకటి నరసింహాచారి రాసిన తాళాంకనందినీ పరిణయం. మాయాబజార్‌లో దాదాపు 27 సన్నివేశాలను... ఈ రెండు గ్రంథాల ఆధారంగానే తయారు చేశారంటున్నారు భజరే మయాబజార్ రచయత రాంభట్ల నృసింహశర్మ

మాయల బజార్..

మాయాబజార్ సినిమా తీసే విషయంలోనూ.. పాత్రలను తీర్చిదిద్దడంలోనూ డైరెక్టర్ కె.వి.రెడ్డి చాలా కష్టపడ్డారు. అయితే.. సినిమా కథలో ప్రధానాంశం శశిరేఖా పరిణయం కాబట్టి.. శశిరేఖకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు. శశిరేఖ ఊహాజనిత పాత్ర కాబట్టి.. ఊహాల పరిధిని మరింతగా పెంచారు. ఘటోత్కచుడు శశిరేఖగా మారడం.. గొంతుమార్చుకోవడానికి దృశ్యరూపం ఇచ్చి మాయాబజారులోకి అందరినీ తీసుకువెళ్లిపోయారు కేవీ రెడ్డి.
భారతంలోధుర్యోధనుడి తనయుడు లక్ష్మణకుమారుడు వీరుడు. కానీ, మాయాబజార్‌లో మాత్రం పిరికివాడుగా కనిపిస్తాడు. పేరే మాయాబజార్ కాబట్టి.. అసలు లక్షణాలను మాయం చేశారనుకోవచ్చు.
పుట్టినప్పటినుంచి కవచకుండలాలతో ఉండే కర్ణుడు ఈ సినిమాలో అవి లేకుండానే కనిపిస్తాడు. అంతేకాదు.. రాక్షసుడైన ఘటోత్కచుడు ఈ సినిమాతో తెలుగువారందరికీ ఆప్తుడిగా మారిపోయాడు. ఎంతో మంచివాడిగా మాయాబజార్‌లో కనిపిస్తాడు.
ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా నిలబెట్టింది కూడా మాయాబజారే. అన్ని పాత్రలకన్నా.. శ్రీకృష్ణ పాత్ర అలంకారం విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు. శ్రీకృష్ణుడు ఏ కిరీటం ధరించాలన్నదానిపై పెద్ద కసరత్తే చేశారట. చివరకు విజయనగరంలో ఉండే కృష్ణ విగ్రహాన్ని చూసి, ఎన్టీఆర్‌కు కిరీటాన్ని తయారు చేశారు. దాని మహత్యమే కాబోలు.. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ అందరిమదిలోనూ నిలిచిపోయారు.
అభిమన్యుడు, శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ.. పాండవులు మాత్రం మాయాబజార్‌లో ఎక్కడా కనిపించరు. భారతానికి సంబంధించి పాండవులను మచ్చుకైనా చూపించని ఏకైక సినిమా కూడా మాయాబజారే కాబోలు. చివరకు సినిమా ముగింపులోనూ.. మాయాబజార్ ప్రత్యేకతే వేరు. సాధారణంగా హీరో హీరోయిన్ల మీద శుభం కార్డు వేయడం పరిపాటి. కానీ.. ఈ సినిమాలో మాత్రం హిడింబిగా నటించిన సూర్యకాంతంపైకి కెమెరా ఫోకస్ అవడంతో సినిమా అయిపోతుంది.. ఇది కూడా మాయాబజార్ ప్రత్యేకతే..

మాయాబజార్‌ ఘన విజయానికి సినిమా కథ ఓ కారణమైతే.. అందులో ఎన్నో మాయలను సృష్టించడమూ మరో కారణం. మాయాబజార్ విషయంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది భజరే మాయాబజార్. పిక్చరైజేషన్ జరిగిన తీరుతో పాటు.. ఒక్కో క్యారెక్టర్‌ను ఎలా మలిచారు.. ఎందుకు మలిచారన్నదీ విశ్లేషిస్తుందీ పుస్తకం. అసలు మాయాబజార్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అపురూప కళాఖండంగా ఎందుకు నిలిచిపోయిందన్నది తెలుసుకోవాలంటే.. ఈ పుస్తకం చదవాల్సిందే.



0 comments:

Post a Comment

Copyright © 2013 AataPaatalu All Right Reserved