ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటి.. ఆస్ట్రేలియా. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి.. ఓపెరా హౌస్.. ఆకాశాన్నంటుకునేలా కనిపించే భవనాలు.. అందమైన నదులు.. ఆకట్టుకునే దీవులు... ఇలా ఆస్ట్రేలియా సౌందర్యాన్ని వర్ణించుకుంటూ వెళితే అంతే ఉండదు. ఆ సౌందర్యాన్ని అలా చూస్తూ సేదతీరాల్సిందే. ఇలాంటి ఆస్ట్రేలియాకు ఇప్పుడో భయం మొదలయ్యింది. అదికూడా అలాంటి ఇలాంటి భయం కాదు.. ప్రాణభయం.
అంతరిక్షం నుంచి ఆస్ట్రేలియాపై దాడి చేయవచ్చంటూ సాగుతున్న ప్రచారం అలజడి సృష్టిస్తోంది. అయితే.. ఇది భూమిపైన ఉన్న దేశాలు చేసే దాడి కాదు.. విశ్వంలో మనకు తెలియని ప్రాంతాల్లో ఉండవచ్చని భావిస్తున్న గ్రహాంతరవాసుల నుంచి.. అసలు ఈ ఏలియన్స్ ఉన్నాయో లేదో నిర్ధారణ కాకపోయినా.. ఆస్ట్రేలియన్లు మాత్రం తమపై దాడి జరగవచ్చని భావిస్తున్నారు. భారీస్థాయిలో ఆస్ట్రేలియాలోని ఉత్తరప్రాంతాన్ని గ్రహాంతరవాసులు ముట్టడించవచ్చంటూ కొంతమంది ఖగోళపరిశోధకులు ప్రకటించడంతో.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది..
దీనికి కారణం.. ఆకాశంలో ఇటీవల చోటు చేసుకున్న మార్పులే.. రాత్రిళ్లు మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాల మధ్య.. తళతళమెరుస్తూ మాయమవుతున్న వింతవస్తువులు తరచుగా దర్శనమిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఇవి మరీ ఎక్కువయ్యాయి. రాత్రుళ్లు ఆకాశంలోకి చూస్తే చాలు.. ఏదోమూల ఈతరహా మెరుపులు కనిపిస్తున్నాయి. ఖగోళంలో చోటుచేసుకున్న ఈ మార్పులే.. ఆస్ట్రేలియన్లను భయపెట్టిస్తున్నాయి.
గ్రహాంతరవాసులా?
కళ్లముందే మెరుస్తాయి.. వేగంగా దూసుకుపోతాయి. నక్షత్రాలను మించి వెలుగులను విరజిమ్ముతాయి. కొద్ది దూరంపోయి అకస్మాత్తుగా మాయమవుతాయి.. ఆకాశంలో తరచుగా కనిపించే దృశ్యాలివి. గ్రహాంతరవాసులపై ప్రయోగాలు చేస్తున్న వారు వీటిపై చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు గందరగోళం సృష్టించాయి. ఆకాశంలో ఇలా మిరిమిట్లుగొలుపుతూ కనిపించి మాయమయ్యే.. వాటిని.. శాస్త్రసాంకేతిక పరిభాషలో ఉల్కలుగా గుర్తించారు. విశ్వం నుంచి అదుపుతప్పి భూమిపైకి వస్తుంటాయని చెబుతారు. ఇప్పడు ఆస్ట్రేలియాలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా ఇవేనన్నది కొంతమంది ఖగోళ పరిశోధకుల అభిప్రాయం.
అయితే.. ఇక్కడే ఓ సమస్య ఉంది. ఉల్కలకు ఉన్న లక్షణం.. కొంతదూరం పాటు వెళ్లి మాయమవడం. కానీ, ఆస్ట్రేలియాలో కనిపిస్తున్న దృశ్యాల్లో చాలావరకూ స్థిరంగా ఒకే చోట వెలుగుతున్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. గుండ్రంగా కనిపిస్తూ.. మిరుమిట్లు గొలుపుతూ.. ఒకే చోట ఎక్కువ సమయం ఉండేవి కూడా తరచుగా దర్శనమిస్తున్నాయి. ఉత్తర ఆస్ట్రేలియాలోని 370 కిలోమీటర్ల పొడవునా.. ఆకాశంలో ఇలా కాంతిగోళాలు ప్రత్యక్షమవుతున్నాయి. గ్రహాంతరవాసులపైనా, ఎగిరేపళ్లాలపైనా పరిశోధకులు చేసేవారు మాత్రం.. ఇవి ఏలియన్స్ వాహనాలే అంటున్నారు. ఉల్కలతో పోల్చితే ఈ కాంతిగోళాలు వింతగా ప్రవర్తించడం చూస్తుంటే.. అవి కచ్చింతంగా గ్రహాంతరవాసులే అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో ఆస్ట్రేలియాపైకి ఇలా గ్రహాంతరవాసులు వస్తున్నాయని యూఎఫాలజిస్టులు ప్రకటించారు. అయితే.. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. గ్రహాంతరవాసుల కన్ను ఎప్పటినుంచో ఆస్ట్రేలియాపై ఉందని.. నిరంతరంగా నిఘా పెడుతున్నాయంటున్న యూఎఫాలజిస్టులు వేసవిలో మేఘాలు తక్కువగా ఉండడం వల్లే మన కంటికి కనిపిస్తున్నాయంటున్నారు. అంతేకాదు.. మన మిలిటరీ యాక్టివిటీస్‌ను కనిపెట్టడానికి ఈ నిఘా పెట్టారంటూ కంగారూల దేశంలో కంగారు పుట్టిస్తున్నారు.
ప్రపంచంలోని నాలుగు ఖండాలకు దూరంగా.. ఒంటరిగా ఉండండతోనే ఆస్ట్రేలియాపై గ్రహాంతరవాసులు కన్నేశాయా... ఈ ప్రాంతంలో స్థిరస్థావరాలు ఏర్పాటు చేసుకొని... ఆ తర్వాత ప్రపంచంపై దండెత్తాలనుకుంటున్నాయా.. ? ఈ అనుమానాలే.. ఆస్ట్రేలియన్లను భయపెడుతున్నాయి.
ఏమిటీ కాంతిపుంజాలు..
ఆస్ట్రేలియన్ల భయాన్ని కాసేపు పక్కన పెడదాం.. గ్రహాంతరవాసులు దాడి చేయవచ్చన్న వారి అనుమానాలనూ వదిలేద్దాం. కానీ, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఆకాశంలో ఆ కాంతిపుంజాల మాటేమిటి? ఈ కాంతి గోళాలు ఎలా సంభవిస్తున్నాయి. వీటిని ఎవరు పంపిస్తున్నారు..
ఆకాశంలో మెరుస్తూ కనిపించి మాయమయ్యేవే ఉల్కలు. వాస్తవానికి ఇవన్నీ గ్రహ శిథిలాలు. ఇవి ఎప్పటి నుంచో మనకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. నింగిలోకి నిశితంగా చూస్తే.. కొన్ని వెలుగు రవ్వలు రాలిపడుతుంటాయి. సంవత్సరంలో దాదాపుగా ప్రతీరోజు ఇలాంటి దృశ్యాలు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. సుదూరప్రాంతంలో విశ్వంలో ఇవి మండిపోతుండడం వల్ల.. మనకు వింతగా కనిపిస్తుంటాయి. అందుకే వీటినే ఖగోళ అద్భుతాలుగా భావిస్తారు.
మన సౌరమండలంలో ఇలాంటి ఉల్కలు, వాటికన్నా పెద్దవైన తోకచుక్కలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో ఇసుకరేణువంత పరిణామం మొదలుకొని కొన్ని వందల కిలోమీటర్ల వ్యాసం ఉన్నవాటినీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఒక్కోసారి గ్రహాలకు చేరువుగా వస్తాయి. ముఖ్యంగా మనకు చేరువలోకి వచ్చినవప్పుడు.. భూవాతావరణంతో సంగమించడం వల్ల.. వీటిచుట్టూ విపరీతమైన వేడి మొదలవుతుంది. వేగంగా దూసుకొని వస్తాయి కాబట్టి రాపిడికి.. మంటలు ఏర్పడతాయి. అవే మనకు కాంతిపుంజాల్లా కనిపిస్తాయి.
ఇలా వాతావరణంలోనే మండిపోవడం వల్ల.. భూమికి చేరకుండానే నాశనం అయిపోతున్నాయి. ఒక్కొక్కటి ఎక్కువగా కనిపించినా.. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఇలా నింగినుంచి రాలిపడుతూ కనిపిస్తాయి. వీటిని.. ఉల్కాపాతాలుగా భావిస్తారు. గ్రహశకలాలు పెద్ద మొత్తంలో భూమికి చేరువలోకి వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారమవుతాయి. ఆకాశం నుంచి ఎవరో ఆశీర్వదించి.. మనపై వరాలు కురిపిస్తున్నట్లుగా.. ఆకర్షణీయంగా ఇలా ఒకేసారి కిందకు మెరుస్తూ జారతాయి.. ఈ షూటింగ్ స్టార్స్.
అయితే.. ఒక్కోసారి.. పెద్దపెద్ద ఉల్కలు భూమిపైకి ప్రచండవేగంతో దూసుకువస్తాయి. వీటిని ఆపడం చాలా కష్టం. భూవాతావరణంలోకి కూడా చొచ్చుకుని వచ్చి.. భూమిని ఢీకొడతాయి. భూమికి ఇలాంటి వాటినుంచి ముప్పుకూడా పొంచి ఉంది. అయితే.. ఇటీవలకాలంలో మాత్రం భారీ స్థాయిలో ఉల్కలు మన భూమిపైకి దూసుకొని రాలేదు. ఒకవేళ వచ్చినా.. వాటిని విశ్వంలోనే నాశనం చేయడానికి ప్రపంచదేశాలు కొత్త కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.
ప్రమాదం పొంచి ఉందా?
మానవపరిణామక్రమం మొదలుకానప్పుడు.. అంటే.. డైనోసార్ల కాలంలో ఓ పెద్ద ఉల్క మన భూమిని ఢీకొని ఉంటుందన్న అంచనా.. శాస్త్రవేత్తలది. డైనోసార్లతో పాటు భూమిపై ఉండే జీవరాశులను ఈ ఉల్కాపాతం నాశనం చేసిఉండొచ్చని భావిస్తున్నారు. డైనోసార్లు అంతం కావడంతో పాటు .. భూమిపైన అనూహ్యమార్పులు చోటుచేసుకోవడానికి ఇలాంటి ఉల్కలు ఢీకొనడమే కారణం అన్న అభిప్రాయం ఉంది. అయితే.. దీన్ని ఇంతవరకూ శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. రెండు శతాబ్దాలుగా చూస్తే.. దాదాపు 11 వందల ఉల్కలు భూమిపై పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గ్రహాంతరవాసుల రూపంలో కాకపోయినా.. సూర్యమండలంలో తిరుగుతున్న ఉల్కల వల్ల మనకు ప్రమాదం ఉండొచ్చన్న అనుమానాలూ భయపెడుతూనే ఉన్నాయి. అయితే.. ఏ ఉల్కలు ఎప్పుడు వస్తాయన్నది కచ్చితంగా లెక్కలు కట్టగలిగారు శాస్త్రవేత్తలు. అయితే.. 2036లో మాత్రం అపోఫిస్ అనే ఓ శకలం వల్ల మన భూమికి ముప్పు పొంచి ఉందంటూ ప్రమాద సంకేతాలు ఇస్తున్నారు ఖగోళ పరిశోధకులు. ప్రస్తుతం మనకు కనిపించనంత దూరంలో ఉన్న ఈ శకలం.. 2029 నాటికి భూమికి దగ్గరలోకి రానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంతవరకూ ఆగాల్సిందే.
ఎక్కడినుంచి వస్తున్నాయి?
సూర్యుడు.. సూర్యుడి చుట్టూ గ్రహాలు.. సూర్యమండలం అంటే ఇంతే అనుకుంటే పొరపాటు. గ్రహాలతో పాటు.. గ్రహశకలాలు కూడా అరుణతార చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సూక్ష్మ పరిమాణం నుంచి ఉపగ్రహాల సైజులో ఉన్న ఈ శకలాలు.. గ్రహాలతో పాటే తిరుగుతున్నాయి. సోలార్ సిస్టంలో కొన్ని కోట్ల గ్రహశకలాలు ఉన్నాయి. సూర్యుడి దగ్గర నుంచి మొదలుపెడితే.. ముందుగా వచ్చే గ్రహం బుధుడు.. ఆ తర్వాత శుక్రుడు.. ఆపై భూమి ఉంటాయి. భూమిని దాటి వెళ్తే.. అంగారకుడు కనిపిస్తాడు. భూమికి అంగారకుడికి మధ్య సుమారు ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా. అంగారకుడీనీ దాటిన తర్వాత.. బృహస్పతి వస్తుంది. ఈ రెండు గ్రహాల మధ్య దూరం 34 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోనే ఉంది.. గ్రహశకలాలకు నెలవైన.. ఆస్టరాయిడ్ బెల్ట్. ఈ ఆస్టరాయిడ్ బెల్డ్ విస్తీర్ణం.. 28 కోట్ల కిలోమీటర్లు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో బెల్డ్ విస్తరించి ఉందంటే.. ఎన్ని ఉల్కలు ఉండిఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఇంత ఎక్కువగా ఆస్టరాయిడ్లు ఈ ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి? దీనిపైనా.. అనేక సందేహాలు శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సూర్యమండలం ఏర్పడినప్పుడు.. గ్రహాల్లోకి చేరని పదార్థాలు విడిగా మిగిలిపోయి.. ఆస్టరాయిడ్లుగా సంచరిస్తున్నాయన్న భావనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక మరో వాదన ప్రకారం.. అంగారకుడికి.. బృహస్పతికి మధ్య.. ఓ గ్రహం గతంలో ఉండేదని.. అది విచ్ఛిన్నం కావడం వల్లే ఈ ఆస్టరాయిడ్ బెల్డ్ ఏర్పడిందన్నది కొంత మంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న దూరం దీనికి ఆధారంగా చూపిస్తున్నారు. అయితే.. శాస్త్రీయంగా మాత్రం ఈ వాదన రుజువు కాలేదు.
ఆస్టరాయిడ్ బెల్ట్ తరహాలోనే.. ప్లూటోను దాటిన తర్వాత క్యూపర్ బెల్ట్ ఉంది. ఇందులోనూ ఎన్నో గ్రహశకలాలు ఉన్నాయి. ఆస్టరాయిడ్ బెల్డ్‌తో పోల్చితే.. ఈ క్యూపర్ బెల్డ్ పరిమాణంలో చాలా పెద్దది. ఇక్కడి నుంచే తోకచుక్కలు ఉద్భవించాయని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. ఆస్టరాయిడ్ బెల్డ్ నుంటే మనకు ఎక్కువగా సమస్యలు ఎదురుకానున్నాయి. దాదాపు 40 వేల ఏళ్ల క్రితమే.. ఓ భారీ ఆస్టరాయిడ్.. అమెరికాలోని ఆరిజోనాలో పడింది. దీని దాటికి కిలోమీటరుకు పైగా వ్యాసం ఉన్న ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది.
ఇలాంటి ఆస్టరాయిడ్‌లు పెద్ద ఎత్తున భూమిపై పడితే జరిగేది వినాశనమే. అయితే.. ఒకేసారి మాకుమ్మడిగా ఇంతవరకూ పడలేదు కాబట్టి.. భవిష్యత్తులోనూ పడతాయని ఊహించలేం. కానీ... అప్పడప్పుడూ.. ఒకటీ రెండు ఉల్కలు మాత్రం భూమిని ఢీకొట్టే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.
0 comments:
Post a Comment